వైసీపీకి 150 సీట్లు ఖాయమట.. టీఆర్ఎస్ సెంటిమెంటా?

 

ఎన్నికలు సమీపిస్తుంటే మా పార్టీకి అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం సహజం. ప్రస్తుతం ఏపీలో కూడా అలాగే ఉంది పరిస్థితి. అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తామని ఇరు పార్టీల నేతలు పోటీపడి మరీ చెప్తున్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైసీపీ ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమది అతి విశ్వాసం కాదని ఆత్మ విశ్వాసమని చెప్పుకొచ్చారు. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అన్ని రకాల ఎత్తుగడలు, చేయరాని పనులన్నీ చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. ఇప్పటికీ ఆయనలో మార్పు లేదని విమర్శించారు. వైసీపీ మూడు నాలుగు దశాబ్దాల పాటు నిలిచిపోయేలా వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేస్తున్నారని సజ్జల తెలిపారు.

నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. తెలంగాణలో 100 సీట్ల సెంటిమెంట్ లాగా ఏపీలో 150 సీట్ల సెంటిమెంట్ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందు 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారం చేపడతామని టీఆర్ఎస్ చెప్పింది. టీఆర్ఎస్ 100 సీట్లు గెలవనప్పటికీ దాదాపు 90 సీట్లలో విజయం సాధించి ఘనంగా అధికారం చేప్పట్టింది. దీన్ని చూసి ఇన్ స్పైర్ అయ్యే ఏపీ నేతలు 150 సీట్లు అంటున్నారేమో అనిపిస్తోంది. 150 అంటే కనీసం 100 కి పైగా గెలుచుకొని అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారేమో. తెలంగాణలో అంటే టీఆర్ఎస్ ఒక్కటే 100 అన్నది. కానీ ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ 150 అంటున్నాయి. మరి అధికారం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu