శవాలను లెక్కించడం మా పని కాదు: ఐఏఎఫ్ చీఫ్

 

పాక్ లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది నిజమేనని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా స్పష్టం చేశారు. తాము అనుకున్న లక్ష్యాన్ని ఐఏఎఫ్ యుద్ధవిమానాలు విజయవంతంగా ఛేదించాయన్నారు. కోయింబత్తూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక లక్ష్యాన్ని ఛేదించాలని మేము ప్లాన్ చేసినప్పుడు కచ్చితంగా ఢీకొట్టి తీరతాం. ఒకవేళ మేము అడవిలో బాంబులు వేస్తే.. పాకిస్తాన్ స్పందించాల్సిన అవసరం లేదు కదా.’ అని అన్నారు. పాక్ భారత్‌పై ప్రతిదాడులకు ప్రయత్నించడమే తాము లక్ష్యాన్ని ఢీకొట్టామనేందుకు రుజువని పేర్కొన్నారు.
 
బాలాకోట్ దాడిలో నిజంగా 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా? అని జరుగుతున్న చర్చపైనా ఆయన స్పందించారు. ఎంతమంది చనిపోయారన్నది తాము చెప్పలేమనీ.. దానిపై ప్రభుత్వమే వివరణ ఇస్తుందన్నారు. ‘మృతదేహాలను లెక్కించడం లేదా అక్కడ ఎంతమంది ఉన్నారన్నది లెక్కించడం మాపని కాదు. లక్ష్యాన్ని ఛేదించామా లేదా అన్నదే మాకు ముఖ్యం.’ అని ఆయన స్పష్టం చేశారు.

అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలపై.. కాలం చెల్లిన మిగ్-21 విమానాలను ఎందుకు ప్రయోగించారన్న విషయంపై కూడా ఆయన స్పందించారు. ఈ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ఆధునిక అవసరాలకు తగినట్టు అప్‌గ్రేడ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న మిగ్-21 బైసన్.. పాత కాలం నాటి మిగ్-21 బిస్ లాంటిది కాదన్నారు. దీనికి మరింత సమర్థమైన ఆయుధ వ్యవస్థ ఉన్నది. సమర్థమైన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ కూడా ఉంది అని పేర్కొన్నారు. మన దగ్గరున్న అన్ని రకాల యుద్ధ విమానాలతోనూ మేము పోరాడతాం అని ధనోవా స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu