ఏపీ ప్రజల డేటా చోరీ కేసు.. వదలిపెట్టే ప్రసక్తే లేదు

 

ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయని.. వాటిని ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ నుంచే డేటా చోరీ అయినందున.. తెలంగాణ పోలీసులే కేసును దర్యాప్తు చేస్తారని స్పష్టంచేశారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశామని తెలిపారు.

ఈ విచారణలో కీలకమైన ఆధారాలను సేకరించినట్టు సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ నిర్వహిస్తోంది. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని సజ్జనార్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. ఆధార్, ఓటరు కార్డులు, కులాలు, ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారనే సమాచారాన్ని కూడ ఈ సంస్థ సేకరిస్తున్నట్టు గుర్తించినట్టుగా సజ్జనార్ చెప్పారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు విచారించాం. లబ్ధిదారుల డేటాను ఎలా సేకరించారు? వారి దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? దర్యాప్తులో తేలుతుంది అన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి 50 చోట్ల కేసులు నమోదయ్యాయని.. డేటా ఆధారంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారా అన్నది విచారించాలని ఆయన తెలిపారు.

సంక్షేమ పథకాల లబ్ది దారుల సమాచారం ప్రభుత్వం తప్ప ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే అవకాశం లేదన్నారు. సున్నితమైన డేటాను ఎందుకు పబ్లిక్‌లో పెట్టారని సజ్జనార్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటా ఐటీ గ్రిడ్ సంస్థకు ప్రభుత్వం నుండి వచ్చిందా? లేక మూడో వ్యక్తి నుండి వచ్చిందా? అనే విషయమై  ఆరా తీస్తున్నట్టుగా  సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆధార్ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికలసంఘానికీ, డేటాను హోస్ట్ చేసిన అమెజాన్ సంస్ధకూ ఫిర్యాదు చేశామన్నారు. అమెజాన్ వెబ్ సర్వర్ల నుంచి మరిన్ని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్‌ని ప్రధాన నిందితుడిగా గుర్తించామని.. తన వద్ద ఉన్న డేటాతో సరెండర్ కావాలన్నారు. ఆయన కోసం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గాలింపు సాగుతోందని, ఆయన పొరుగు రాష్ట్రంలో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.

అయితే దీనిపై టీడీపీ వాదన మాత్రం మరోలా ఉంది. సేవామిత్ర యాప్ టీడీపీ కార్యకర్తల యాప్. టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారంతా తమ అనుమతితో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కలర్ ఫోటోలు ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu