చంద్రబాబు మీ పరిస్థితి ఏం బాగాలేదు.. వాడుకో, వదిలేయ్‌

 

కొద్దిరోజులుగా మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరతారని, లేదు లేదు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో అభిమానులు, కార్యకర్తలతో డీఎల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, మరోసారి ఓటు వేయించుకునేందుకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకున్నానని చెప్పారు. ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నానన్నారు. ఈ వయస్సులో పార్టీల చుట్టూ తిరగడం చూస్తే సిగ్గుగా ఉందన్నారు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎందరికో బీఫారం ఇప్పించిన మనిషిని ఇప్పుడు తన బీఫారం కోసం టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీల దగ్గరకు పోవడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ వల్ల నష్టపోయిన వారు 20 శాతం మంది ఉన్నారన్నారు. మనతో ఉంటూ వైసీపీకి మద్దతు ఇచ్చి తన దగ్గర పనులు చేసుకున్నవారు 20 శాతం ఉన్నారన్నారు. ఈ 40 శాతం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు ప్రయత్నం చేయకూడదని అభిమానులు అడుగుతున్నారని తెలిపారు.

'సీఎం చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో వెళ్లి కలిశాను. 1978లో ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి రావడంతో చంద్రబాబు కొలిగ్‌ కావడంతో నా గురించి గొప్పగానే చెప్పారు. ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అప్పుడు నేను పింఛను వెయ్యి రూపాయలను రెండువేలు చేయకపోతే మీదగ్గరకు వచ్చేవాన్ని కాదని, మా గ్రామంలో కొందరు పెన్షన్‌దారులు వచ్చి ఆనందం వ్యక్తం చేశారని ఆయనకు గుర్తు చేశాను. 41 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి విచ్చలవిడి అవినీతి చూడలేదు. రూ.1.20 లక్షలు తీసుకుని ఓ తహసీల్దార్‌ పాస్‌ బుక్‌ కోసం ఆన్‌లైన్‌లో రైతు వివరాలు ఎక్కించారని సీఎం దృష్టికి తీసుకుపోయా. సీఎంగా మీరు నీతిమంతులుగా ఉంటే సరిపోదు. మంత్రులు, అధికారులు ఎంత సంపాదించారో చూడండి. మీ పరిస్థితి ఏమీ బాగలేదని చెప్పా. ఆకర్షించు, వాడుకో, వదిలేయ్‌ సిద్థాంతాలతో చంద్రబాబు నడుస్తారని.. కనీస విలువ ఇవ్వకుండా మైదుకూరు టికెట్‌ ప్రకటించేటప్పుడు మాట కూడా చెప్పలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశా.. పార్టీ చందా ఇస్తాడని సుధాకర్‌కు టికెట్‌ ఇస్తున్నానని చెప్పినా నేను బాధపడేవాన్ని కాదు. టీడీపిని సాధించాలి, పునాదులు లేకుండా చేయాలి.. నా ఆలోచనలకు తోడు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గెలిపిస్తాను. మాలాంటి నేతల సేవలు ఉపయోగించుకుంటే జిల్లాలో టీడీపీని కూకటివేళ్ళతో పెకలిస్తాం' అని డీఎల్‌ అన్నారు. టీడీపీలో చేరడం లేదని డీఎల్‌ మాటల్లో కనిపించింది. ఇక వైసీపీ నుంచి పిలుపు వస్తే చేరతారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu