తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

 

కరెంటు కోతలు, పంట నష్టం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గడచిన ఐదు నెలల కాలంలో తెలంగాణలో మొత్తం నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. శుక్రవారం నాడు తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌లో మాలిగ దశరథ (45) అనే రైతు తన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు. ఇదిలా వుండగా శనివారం మధ్యాహ్నం తెలంగాణలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందపల్లిలో సారంగపాణి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధను తట్టుకోలేక పురుగుల మందు తాగి సారంగపాణి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.