మామ కేసీఆర్ పాచికలు అల్లుడు హరీశ్ రావు దగ్గర పారెనా?
posted on Nov 2, 2015 3:04PM
.jpg)
కేసీఆర్ కు రాజకీయానుభవం.. రాజకీయ తెలివితేటలు చాలా ఎక్కువని.. ఆయన రాజకీయ తంత్రాలకు ఎవరైనా పడిపోవాల్సిందే అంటారు. మరి అలాంటి కేసీఆర్ కు ఎప్పుడూ పక్కన ఉండి సలహాలు ఇస్తూ.. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉండేది ఎవరంటే మాత్రం ముందొచ్చే పేరు హరీశ్ రావు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి బలం ఉన్న నాయకుడు ఎవరంటే హరీశ్ రావు అని స్పెషల్ గా చెప్పనవసరంలేదు. మరి అలాంటి హరీశ్ రావును కేసీఆర్ దూరం పెడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎప్పటినుండో కేసీఆర్ హరీశ్ విషయంలో కొంచం అభద్రతాభావంతో ఉన్నారని తెలుసు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వస్తున్నారు కేసీఆర్. ఈ సారి మరోసారి హరీశ్ ప్రాధాన్యతను తగ్గించి ఆయనను దూరం పెట్టినట్టు తెలుస్తోంది.
వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో హరీశ్ రావును కేసీఆర్ ఎన్నికల ఇంఛార్జ్ గా నియమించారు. మళ్లీ ఏం ఆలోచించారో ఏమో కాని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్న రెండు రోజులకే హరీశ్ రావును వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గానికి మాత్రమే ఇంఛార్జిని చేసి మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లకు ఆరుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కేసీఆర్ ను చూసి మిగిలిన పార్టీ నేతలు కూడా హరీశ్ రావును అంతగా పట్టించుకోనట్టు తెలుస్తోంది. అందుకే వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో వేయించిన ఫ్లెక్సీల్లో కూడా హరీశ్ ఫొటో ఎక్కడా కనిపించడంలేదు. మొత్తానికి భవిష్యత్ లో హరీశ్ రావు తనను ఎక్కడ డామినేట్ చేస్తాడా అని భయపడి ఇప్పటినుండే హరీశ్ రావు ఉనికిని తగ్గిస్తున్నారు కేసీఆర్. మరి మామ పాచికలు అల్లుడి దగ్గర ఎన్నిరోజులు పారతాయో చూడాలి.
అయితే ఎంతో జ్ఞానవంతుడైన హరీశ్ రావుకు మామ చేసే కుతంత్రాలు తెలియకుండా ఉంటాయా. ఎప్పటి నుండో కేసీఆర్ వెంట తిరిగే హరీశ్ రావుకు తెలియదు అనుకోవడం అమాయకత్వం. కానీ ఎవరికైనా ఒక సమయం అంటూ వస్తుంది. అప్పుడు హరీశ్ రావు తన మామకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అలా ఇస్తారు అని తెలుస్తోంది.