రణమా.. శరణమా.. సమయం లేదు మిత్రమా!
posted on May 12, 2025 7:08AM

పాకిస్థాన్ ను ఇండియా అల్టిమేటమ్
యుద్ధ విరమణకు భారత్ షరతులు ఏంటో తెలుసా?
భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ దేవులాడుకుని, భారత్ మానవతా దృక్పథంతో అందుకు అంగీకరించి రువాత పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాక్ కు ఇక అన్ని దారులూ మూసుకుపోయాయి. అలుంగుటయే ఎరుంగని.. అన్నట్లుగా ఇంత కాలం శాంతి మంత్రం జపిస్తూ వచ్చిన వచ్చిన ఇండియా కన్నెర్ర చేసింది. దీంతో పాకిస్థాన్ ను పూర్తిగా కాళ్ల బేరానికి తెచ్చుకునేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం (మే11) భారత్, పాకిస్థాన్ డీజీఎంవోల మధ్య హాట్ లైన్ లో జరగనున్న చర్చల నేపథ్యంలో ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా శాంతి, యుద్ధ విరమణ విషయంలో విధించాల్సిన షరతులపై వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
ఆ షరతులేమిటన్నది తెలియగానే భారత్ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు రెండు రోజుల కిందట కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ కాళ్ల బేరానికి వచ్చినప్పుడే ఈ షరతులు విధించి ఉండాల్సిందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్లుగా.. పాక్ కుత్సిత బుద్ధిని తానే బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టుకునే దాకా ఆగి మోడీ కీలెరిగి వాత పెట్టిన చందంగా ఈ ప్రతిపాదనలను తీసుకువచ్చారనీ, ఈ షరతులను అంగీకరిస్తేనే పాక్ లో సంధి అన్న స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా త్రివిధ దళాధిపతులతో సమావేశంలో ఆయన ఆదేశించారు. ఇంతకీ ఆ షరతులేమిటంటే.. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి పర్యాటకులని హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నది మొదటి షరతు కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని బేషరతుగా భారత్‌కు అప్పగించాలన్నది రెండో షరతు. ఇరు దేశాల మధ్యా శాంతి, సంధి కుదరాలంటే ఈ షరతులకు అంగీకరించడం వినా మరో మార్గం లేదని ఆ దేశానికి విస్పష్టంగా చెప్పాలని మోడీ త్రివిధ దళాధిపతుల సమావేశంలో చెప్పారు.
అయితే ఈ రెండు షరతులకు పాకిస్థాన్ అంగీకరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. భారత్ విధించనున్న రెండు షరతులలో మొదటిదైన ఉగ్రవాదుల అప్పగింత విషయానికి వస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, వారిని భారత్ లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తోందన్న భారత్ ఆరోపణలు అక్షర సత్యాలని స్వయంగా అంగీకరించి, ధృవీకరించినట్లవుతుంది. ఇక భారత్ నుంచి ఎలాగైనా మొత్తం కశ్మీర్‌ను దక్కించుకోవాలన్న దుర్భుద్ధితో దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని భారత్‌కి అప్పగించడానికి అంగీకరిస్తే.. ఇన్ని దశాబ్దాలుగా పాక్ వాదన అంతా తప్పుల తడకగా తేలిపోతుంది. అంతర్జాతీయ వేదికలపై తాను చేసిన వాదనలన్నీ తప్పని స్వయంగా అంగీకరించినట్లు అవుతుంది. అన్నిటికీ మించి సొంత ప్రజలనే మోసం చేసినట్లు పాక్ పాలకులు, సైన్యం అంగీకరించినట్లు అవుతుంది.
ఆ కారణంగానే పాకిస్థాన్ అందుకు అంగీకరించే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో భారత్ తో సై అని యుద్ధానికి దిగే సత్తా కూడా ఆ దేశానికి లేదు. యుద్ధమే కనుక జరిగితే.. రోజుల వ్యవధిలోనే పాక్ పనైపోతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కోల్పోవడము కాకుండా, పాకిస్థాన్ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ పాక్ కు రణమా.. శరణమా.. సమయం లేదు మిత్రమా అంటూ ఇవ్వబోయే అల్టిమేటమ్ కు పాక్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సిందే.