ఆరుగురిని హత్య చేసిన కేసులో ఒకనికి ఉరి.. విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు

పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ  జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.  ఏప్రిల్ 15, 2021న అప్పల రాజు పాత కక్షలతో బమ్మిరి రమణ అనే వ్యక్తి కుటుంబానికి చెదిన ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. బమ్మిడి రమణ కుటుంబంతో అప్పల రాజు కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటికి తోడు బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అప్పలరాజు కుమార్తెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచీ రెండు కుటుంబాల మధ్యా వైరం తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే బమ్మిడి రమణ కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే 2021లో స్థానిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఆ కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఇదే అదునుగా భావించిన అప్పలరాజు బమ్మడి రమణ సహా ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.   విశాఖపట్నం జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.  ఈ కేసులో కోర్టు అప్పలరాజును దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష విధించింది.