చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ!

స్కిల్  స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును ఏసీబీ కోర్టు షరతులతో సీఐడీ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో  ఆయనను సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారింస్తారు. అందులో భాగంగానే శనివారం ఉదయం చంద్రబాబుకు రాజమహేంద్రవరం జైలులో వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తున్నారు.  ఈ విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ పాల్గొన్నారు! వీరితో పాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులు (ఎమ్మార్వో – వీఆర్వో) ఉన్నారు. కాగా చంద్రబాబును శనివారం, ఆదివారం( సెప్టెబర్ 23, 24) రెండు రోజుల పాటు సీఐడీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున విచారణను పర్యవేక్షించేందుకు ఇద్దరు న్యాయవాదులను కూడా కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే .

రెండు రోజులూ కలిపి చంద్రబాబును సీఐడీ మొత్తం 15 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు వయస్సు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రతి గంటకూ ఐదు నిముషాలు విరామం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా చంద్రబాబు కోరితే  మరిన్ని విరామాలు కూడా తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  చంద్రబాబుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని కస్టడీ ఉత్వర్వులు వెలువరించే సమయంలో ఏపీసీ కోర్టు విస్పష్టమైన ఆదేశాలను ఏపీ సీఐడీకి ఇచ్చింది. అలాగే చంద్రబాబు విచారణకు సంబంధించి ఫొటోలూ, వీడియోలు లీక్ అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అంతే కాకుండా విచారణ గడువు ముగిసిన వెంటనే అంటే ఆదివారం (సెప్టెంబర్ 24) సాయంత్రం చంద్రబాబు విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్ తో రికార్డు చేసిన వీడియోను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ గడువు ముగిసిన తరువాత చంద్రబాబును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సాయంత్రమే కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.

అంతకు ముందు చంద్రబాబును విచారించేందుకు 12 మందితో కూడిన బృందంలోని వారి పేర్లను సీఐడీ న్యాయస్థానానికి సమర్పించింది.