విశాఖ సీటుఫై టిఎస్ఆర్-పురంధేశ్వరి ల పట్లు

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమయం మరో రెండేళ్లు ఉండగానే విశాఖపట్న లోక్‌సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ పురంధేశ్వరి, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టి సుబ్బిరామిరెడ్డిలు ఇప్పటి నుంచి సిగపట్లుపట్టారు. ఈ స్థానం తనదంటే తనదంటూ ఇప్పటి నుంచి విశాఖ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం తనదేనని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఓ ప్రముఖ దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ  2009 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు లోక్‌సభకు పోటీ చేయరాదని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకే తాను పోటీ చేయలేదని, ఈసారి ఈ స్థానం తనదేనని ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రమంత్రి విశాఖ సిటింగ్ ఎంపీ పురందేశ్వరి మరో స్థానం చూసుకోవాలని ఆయన సూచించారు.కేంద్ర మంత్రి పురందేశ్వరితో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ముప్ఫయ్యేళ్లుగా విశాఖ ప్రజలతో తనకు అనుబంధం ఉందని, తాను పోటీ చేస్తే గెలిపించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని సుబ్బిరామిరెడ్డి అన్నారు.  అయితే ఆమె మేలుకోరి విశాఖతోపాటు మరో స్థానాన్ని కూడా ముందుగానే ఎంపిక చేసుకోవాలని సూచించానన్నారు.  

అయితే, అధిష్ఠానానికి ఇబ్బంది ఎదురుకాకుండా విశాఖతోపాటు నరసరావుపేట, నెల్లూ రు, ఒంగోలు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.విశాఖ నుంచి పోటీ చేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. టికెట్ల కేటాయింపు సమయంలో ఒకే స్థానం కోసం పట్టుబడితే అధిష్ఠానంతోపాటు తమకు ఇబ్బందులు తప్పవన్నారు. విశాఖలో పురందేశ్వరికి పూర్తిస్థాయి బలం లేదని, అందువల్ల ఆఖరి నిమిషంలో ఆమె ఇబ్బందులుపడే అవకాశం ఉందన్నారు. తాను ఇక్కడే పోటీ చేయాలన్న పట్టుదలతో ఇటువంటి ప్రస్తావన తేవడం లేదని, పురందేశ్వరి అంటే తనకు అత్యంత అభిమానమని ఆయన అన్నారు. తాను పోటీ చేయనంటేనే విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఆమోదిస్తారు తప్ప, తనను కాదని ఆమె పోటీ చేయడం సరికాదని సుబ్బిరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో అధిష్ఠానం సర్వే జరిపించి ఎవరు పోటీ చేయాలన్న అంశాన్ని నిర్ణయిస్తుందన్నారు. టికెట్ కేటాయించే ముందు ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటుందన్నారు.

తనలాగే పురందేశ్వరికూడా మరికొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధిష్ఠానానికి తెలియజేయాలని సూచించారు. తాను విశాఖ నుంచే పోటీ చేసి విజయం సాధిస్తానని, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పురందేశ్వరి తనను అపార్థం చేసుకోరాదని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu