విటమిన్-డి మోతాదు మించితే పాయిజన్‌గా మారుతుందా?
posted on Sep 12, 2025 11:52AM
.webp)
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ద్వారా విటమిన్లు, ఖనిజాలు క్రమం తప్పకుండా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ శరీరానికి విటమిన్-డి అందేలా చూసుకోవాలి. ఇది వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరం తయారు చేసుకునే విటమిన్. విటమిన్ డి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది ఎముకలకు చాలా అవసరం. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాలు సరిగ్గా పనిచేస్తాయి, బలహీనత ఉండదు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటు వ్యాధుల నుండి రక్షించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ప్రతిరోజూ తగినంత పరిమాణంలో విటమిన్-డి అవసరం. కానీ విటమిన్ డి ఎంత ముఖ్యమో, దాని మోతాదు మించితే అంతే హానికరం అని చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
విటమిన్-డి మోతాదు మించితే కలిగే ప్రమాదం..
ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ దాదాపు 400–800 IU (10–20 మైక్రోగ్రాములు) విటమిన్ డి సరిపోతుంది. క్రమం తప్పకుండా ఈ పరిమాణం కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే శరీరం అనేక రకాల నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని విటమిన్ డి టాక్సిసిటీ అంటారు.
సాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ కాలం అవసరమైన దానికంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు విటమిన్ డి టాక్సిసిటీ ప్రమాదం వస్తుంది. ఆహారం ద్వారా ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది, వాంతులు అవుతాయి. అంతేకాకుండా, బలహీనత, తలతిరుగుడు, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం పెరుగుతుంది.
హైపర్‌కాల్సెమియా వల్ల మూత్రపిండాల నష్టం..
శరీరంలో విటమిన్ డి పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. దీనిని హైపర్‌కాల్సెమియా అంటారు. అధిక కాల్షియం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది.
విటమిన్-డి మోతాదు మించితే జరిగేది ఇదే..
జీర్ణక్రియకు ఆటంకం..
శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. ఇది జీర్ణ సమస్యలు, విరేచనాలు, అపానవాయువుకు కారణమవుతుంది. విటమిన్ డి సప్లిమెంట్ల అధిక మోతాదు వికారం, వాంతికి కారణమవుతుంది.
మెదడుపై ప్రభావం..
కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా తరచుగా తల బరువుగా అనిపించడం, తల తిరగడం, ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ ఏదైనా విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. చిరాకు, విశ్రాంతి లేకపోవడం పెరుగుతుంది. తీవ్రమైన పరిస్థితులలో గందరగోళానికి గురవడం లేదా కోమాలోకి వెళ్ళడం కూడా జరగవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...