విశాఖ దేశంలో విభేదాలు
posted on May 1, 2012 10:30AM
విశాఖజిల్లా పాయకరావుపేట ఉపఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేస్తున్న పింగళి వెంకట్రావ్ కు ఆదిలోనే హంసపాదు ఎదుఅరైంది. ఆయన ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. తెలుగుతమ్ముళ్ళు మాత్రం పరస్పరం కలహించుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. పింగళి వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
హైదరాబాద్ నుంచి పార్టీ సీనియర్లు వచ్చినప్పటికీ ఆయన వారిని కలుసుకోవటం లేదు. తెలుగుదేశంపార్టీ తరపున డెయిరీ చైర్మన్ గా గెలుపొందిన తులసీరావు వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకపోగా, ఆయన కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తులసీరావు వంటి నాయకులు పార్టీలో ఇంకా అనేకమంది ఉన్నారనీ, ఇటువంటి నాయకులపై చర్యలు తీసుకోకపోతే పాయకరావుపేట ఉపఎన్నికల్లో పార్టీ పరాజయం తప్పదనీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. పార్టీలోని అసమ్మతివాదుల చర్యలు పార్టీ అభ్యర్థి పింగళి వెంకట్రావుకు తలనొప్పిగా మారాయి.