పాల్వాయి, రేణుకా చౌదరి తెలంగాణా ద్రోహులా?
posted on May 1, 2012 10:28AM
తెలంగాణా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా సాధనకోసం ప్రయత్నిస్తున్న వీరు పరస్పరం కలహించుకుంటూ తెలంగాణా వాదాన్ని అపహాస్యం పాలుజేస్తున్నారు. తాజాగా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన పాల్వాయి గోవర్థనరెడ్డి, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరిలను మిగిలిన కాంగ్రెస్ ఎంపిలు టార్గెట్ చేస్తున్నారు. మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితర తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు ఈ ఇద్దరినీ తెలంగాణా ద్రోహులుగా ప్రకటించారు.
తాము లోక్ సభలో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించి సస్పెండ్ కాగా ఈ ఇద్దరు ఎంపీలు తమకు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన తీరుపట్ల సోనియాగాంధీ ఆగ్రహంతో ఉందని పాల్వాయి గోవర్థన్ బహిరంగంగా చెప్పటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు. నిజంగా సోనియాగాంధీకి తమపై కోపం ఉంటే తమని పిలిచి మాట్లాడతారని, అలా కాకుండా పాల్వాయి వద్ద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రేణుకాచౌదరి కూడా తెలంగాణా ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలో తెలంగాణా సెంటిమెంట్ బాగా తగ్గిపోయిందని ఆమె ఇటీవల పార్టీ అధిష్టానానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని వారు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తెలంగాణా ద్రోహులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు అంటున్నారు.