విశాఖలో "పోకిరీ"లను ఆపేదెవరు..?

ఉక్కునగరం విశాఖలో పోకిరీల ఆగడాలకు నిదర్శనం..నవ్యాంధ్ర ఆర్ధిక రాజధానిలో మహిళకు భద్రత లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. విశాఖ నగరంలోని జాతీయ రహదారిపై పరవాడ మండలం సాలాపువానిపాలెం వద్ద రెండు రోజుల క్రితం కారు ఢీకొని వివాహిత మృతిచెందిన కేసు ఊహించని మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని..ఉద్దేశ్యపూర్వకంగా కారు ఢీకొట్టి చంపారని మృతురాలి బంధవులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడికి చెందిన దంపతులు మాటూరి అప్పలరాజు, లావణ్య, అతడి చెల్లెలు ఆదివారం ఉదయం అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు.

 

అయితే దర్శనం చేసుకునే సమయంలో అనకాపల్లికి చెందిన "దాడి హేమకుమార్", అతని స్నేహితులు లావణ్య పట్ల, దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అప్పలరాజు వారిని సున్నితంగా మందలించాడు. దీంతో హేమకుమార్ అతని స్నేహితులు మరింత రెచ్చిపోయారు. చివరకు ఆలయ ప్రాంగణంలో భోజనం చేసే సమయంలో కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారితో గొడవెందుకని భార్యను, చెల్లెల్ని తీసుకుని బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు అప్పలరాజు. అయితే మద్యం మత్తులో ఉన్న హేమకుమార్, అతడి స్నేహితులు కారులో వారిని వెంబడిస్తూ లావణ్యను, దివ్యను మరింతగా వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో సాలాపువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని హేమకుమార్ తన కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో లావణ్య రోడ్డుపై పడిపోయింది. అయినా కనికరం లేకుండా ఆమెను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అప్పలరాజు, దివ్య రోడ్డుకు పక్కగా పడిపోవడంతో వారిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

 

ఈ సంఘటన చూసిన స్థానికులు కొందరు కారును వెంబడించారు. నిందితులు వాయువేగంతో దూసుకెళ్లడంతో వారికి చిక్కలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించగా పరవాడ ప్రాంతంలో వారు ఉపయోగించిన కారు కనిపించింది. ప్రధాన నిందితుడు దాడి హేమకుమార్ గురించి చేసిన దర్యాప్తులో అతని గురించి నిజాలు తెలిశాయి. వారసత్వంగా వచ్చిన కోట్ల రూపాయల ఆస్తితో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ స్నేహితులను వెంటేసుకుని జల్సాలు చేస్తుండేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు ఆ నరరూప రాక్షసుడిని వెంటాడుతున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇదొక్కటే కాదు విశాఖలో మహిళలు కీచకుల మధ్య బ్రతుకుతున్నారు. రోడ్లు, వీధులు , కళాశాలలు, ఆఫీసులు ఇలా ఎక్కడ చూసిన ఆకతాయిలు ఈవ్‌టీజింగ్ చేస్తూ ఆడవారిని హింసిస్తున్నారు. వీరిలో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసినా అందరూ "బడాబాబుల" బాబులు కావడంతో కేసులు నిలబడటం లేదు. తల్లిదండ్రులకున్న పలుకుబడి, అంగబలం, అర్థబలంతో పుత్రరత్నాలు రెచ్చిపోతూ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.