సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారణ కమిషన్

 

విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే, ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు.స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది. 

ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా, శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్షించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.