సీమాంధ్రకు న్యాయం చేయండి: మోడీ

 

 

 

రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చాలా అన్యాయం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో బలపడాలన్న కాంగ్రెస్ అత్యుత్యాహం వల్ల సీమాంధ్ర ఎంతగానో నష్టపోయింది. విడిపోతామన్నది తెలంగాణ వాదులే అయినప్పటికీ, సీమాంధ్ర అన్యాయానికి గురైంది. చెట్ల కింద కూర్చుని పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితిలో సీమాంధ్ర వుంది. సీమాంధ్రకి విభజనలో అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీకి స్పష్టంగా తెలుసు. ఎన్నికల ముందు కూడా ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన ఈనెల 26న ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నారు.

 

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రెండు రోజుల క్రితం మోడీని కలిసినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలతో అనిల్ గోస్వామి మోడీని కలిసినట్టు సమాచారం. ఈ సందర్భంగా అనిల్ గోస్వామితో చర్చించిన మోడీ, రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏయే చర్యలను తీసుకున్నారని ఆయనను ప్రశ్నించారని తెలిసింది. అలాగే విభజన ప్రక్రియలో ఏవైనా లోపాలు వుంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించినట్టు సమాచారం.

మోడీతో జరిగిన చర్చ వివరాలను హోంశాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శికి తెలియజేయగా, రాష్ట్ర విభజనపై త్వరలో మోడీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి విభజనపై మోడీకి పూర్తి అవగాహన వచ్చేలా చేయాలని కేబినెట్ కార్యదర్శి నిర్ణయించినట్టు తెలుస్తోంది.  ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూశాక మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.