దుబాయ్‌లో ‘విరాట్‘ పర్వం
posted on Feb 24, 2025 1:13PM
.webp)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అలవోకగా పాకిస్థాన్ లెక్క సరిచేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తమదే ఆధిపత్యమని విర్రవీగుతున్న పాక్‌కు విరాట్ కోహ్లీ బ్యాట్‌తో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫామ్ తాత్కాలికమని.. క్లాస్ శాశ్వతమని మరోసారి చాటి చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలు, కింగ్ విరాట్ ఓ యుద్ధానికి సిద్ధమైనట్లు సాధన చేస్తాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో కూడా నెట్స్‌కు అందరికంటే రెండు మూడు గంటల ముందే వచ్చి సుదీర్ఘంగా ప్రాక్టీస్‌లో గడిపాడు. ఆ ఫలాన్ని మ్యాచ్‌లో అందుకొన్నాడు. ఇక విరాట్ మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. తాజా మ్యాచ్‌లో కూడా రోహిత్ తర్వాత మరో వికెట్ వెంటనే కోల్పోకుండా.. మెల్లగా స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ.. టాప్‌గేర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో పాక్ ఆటగాళ్లు ఎంత కవ్వించినా, తన సహనాన్ని కోల్పోకుండా స్థిమితంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇది విరాట్ అసలైన స్టైల్‌కు పూర్తిగా భిన్నం. పాక్‌పై తన కెరీర్‌లో కింగ్ మొత్తం 17 వన్డేలు ఆడాడు. వాటిల్లో 4 శతకాలు, రెండు అర్ధశతకాలున్నాయి. దాయాదిపై 2015 నుంచి ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇక టీ-20 ఫార్మాట్‌లో కూడా అతడికి పాక్‌పై ఘనమైన రికార్డే ఉంది. 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ శతకాలు, 70 సగటుతో ఏకంగా 492 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి కోరల నుంచి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌తో జరిగే సమరం విషయంలో ఫ్యాన్స్ భావోద్వేగాలు అతడికి బాగా తెలుసు.
అంతేకాదు.. ఇటీవల విరాట్ కవర్‌డ్రైవ్ కొడితే వికెట్ కోల్పోతున్నాడంటూ జరిగిన ప్రచారానికి ఈ మ్యాచ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. హారిస్ రవూఫ్ ఈ మ్యాచ్‌లో విరాట్‌ను ఊరించేలా ఆఫ్‌స్టంప్ బయటకు బంతిని వేశాడు. కోహ్లీ తన ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌తో దానిని బౌండరీ లైన్ దాటించాడు. కొద్దిసేపటి తర్వాత మరోసారి కవర్ డ్రైవ్‌తో బౌండరీకి చేర్చాడు.
సాధారణంగా ఛేజింగ్ అంటే జట్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ, విరాట్ దీనికి పూర్తిగా భిన్నం. లక్ష్యాన్ని వేటాడుతూ పరుగుల వరద పారించడం అతడి స్టైల్. తన కెరీర్‌లో 158 ఇన్నింగ్స్‌ల్లో ఛేజింగ్ చేశాడు. దాదాపు 7,975 పరుగులు ఈ క్రమంలో సాధించినవే. అంతే కాదు.. అతడు 27 శతకాలు.. 41 అర్ధశతకాలను కూడా ఆ సమయంలోనే పూర్తి చేశాడు. కెరీర్ బ్యాటింగ్ సగటు 58 కాగా.. ఛేజింగ్‌లో మాత్రం 64గా ఉంది. ఈ గణాంకాలు లక్ష్యసాధనలో విరాట్ ఎంతటి ప్రమాదకారో చెబుతున్నాయి.