ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
posted on Feb 24, 2025 1:48PM
.webp)
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్‌లో అయిదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల 29తో ముగియనుంది. వాటి భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది, మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, అదేరోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ విడుదల చేస్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ముగ్గరు, కాంగ్రెస్‌తో ఉన్న మైత్రితో ఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది ఇక కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం పూర్తి కానుంది
ఇక ఏపీలో మొత్తం ఐదు స్థానాలు కూడా కూటమికే దక్కే అవకాశాలు ఉన్నాయి. జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు వారి పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన్ని శాసనమండలికి పంపిస్తారంటున్నారు. మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.