షర్మిలపై దుష్ప్రచారం.. ఇక విమలమ్మ వంతు?

కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు. కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు కూడా సాగుతోంది. అయితే ఈ ఐదేళ్లలో వివేకా హత్య ఎవరు ఎందుకు చేశారు? చేయించారు? అన్న ప్రశ్నలకు ప్రజలకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించేసింది. 

అయితే జగన్ శిబిరం మాత్రం ఇంకా వివేకా హత్య విషయంలో అవినాష్ సుద్దపూసే అంటూ వస్తోంది. అక్కడితో ఆగకుండా వివేకా కుమార్తె సునీతపైనే ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు సునీతకు మద్దతుగా షర్మిల కూడా అవినాష్ కు వివేహా హంతకుడిగా అభివర్ణిస్తూ హంతకుడికి మద్దతుగా నిలుస్తున్న జగన్ కు ఓటే వేయద్దని, నిజమైన వైఎస్ వారసురాలిగా తనను కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కొంగు జాచి అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్ శిబిరంలో ఆందోళన  మొదలైంది. షర్మిలపైనా వైసీపీ సోషల్ మీడియాలో  ట్రోలింగ్ ఆరంభమైంది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు స్వయానా చెల్లెలు అయిన షర్మిలపై వైసీపీ విమర్శలు మర్యాద గడప దాటేస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రతిష్ట మసకబార్చడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే వాటన్నిటికీ దీటుగా బదులిస్తూ జగన్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. 

అయితే షర్మిల కడపలో ప్రచారం ఆరంభించగానే త్రాసు ఆమె వైపు మెగ్గినట్లు స్పష్టంగా తెలిసిపోవడంతో జగన్ తన మేనత్త విమలమ్మను రంగంలోకి దింపారు. దీంతో ఇప్పుడు సొంత మేనత్తే షర్మిలపై దుష్ప్రచారానికి నడుంబిగించినట్లు అయ్యింది. దీంతో వైఎస్ కుటుంబ రాజకీయ పోరు కుటుంబంలోని మహిళల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లైంది  షర్మిల, సునీత ఒకవైపు.. జగన్, అవినాష్ రెడ్డి మరో వైపుగా గా ఉన్న కుటుంబ యుద్ధంలోకి   విమలమ్మ ఎంట్రీ ఇచ్చారు.  క్రైస్తవ మత ప్రచారానికే పరిమతమైన విమలమ్మ  జగన్ కు, అవినాష్ కు మద్దతుగా రాజకీయ ప్రచారానికి నడుంబిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిల చెల్లెలైన విమలమ్మ వైఎస్ మరణం తరువాత కుటుంబంలో జగన్ పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు.

షర్మిల చెబుతున్నట్లు విమలమ్మ కుమారుడికి సీఎం జగన్ వర్క్స్ ఇవ్వడం వల్లనే ఆమె ఆర్థికంగా స్థిరపడి ఆ కృతజ్ణతతో జగన్ పక్షాన నిలిచి ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం అది కాదు..  సొంత అన్న వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు మద్దతుగా విమలమ్మ గళం విప్పడమే ఆమె ప్రతిష్టను కడప వాసులలో మసకబారేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనకోడళ్లు షర్మిల, సునీతలను ఆమె నోరు మూసుకోమంటూ గదమాయించేలా మాట్లాడడాన్ని కూడా వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారిలో ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.  అవినాష్ రెడ్డిని ఏమీ తెలియని చిన్న పిల్లాడిగా అభివర్ణిస్తూ ఆమె మీడియా సమావేశంలోఅవినాష్‌రెడ్డిని చిన్నపిల్లాడిగా అభివర్ణించిన విమలమ్మ  షర్మిల, సునీతలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను రోడ్డుకీడ్చారు అనడాన్ని తప్పుపడుతున్నారు.  

అలాగే షర్మిల, సునీతలు చంద్రబాబు చెప్పినట్లల్లా ఆడుతున్నారంటూ విమర్శించడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో అన్న విజయం కోసం కాళ్లరిగేలా తిరిగిన షర్మిలకు అన్న జగన్ ఇచ్చిన మర్యాద, గౌరవం ఏమిటని నిలదీస్తున్నారు.  మేనత్త   వ్యాఖ్యలు,  హెచ్చరికలపై షర్మిల ఘాటు స్పందనను స్వాగతిస్తున్నారు.   
ఇప్పుడు జగన్ విమలమ్మను షర్మిల సానుకూల ఓట్లను చీల్చేందుకు ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కడప రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది.  షర్మిలకు వ్యతిరేకంగా విమలమ్మ ప్రచారానికి పెద్దగా స్పందన లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావించడం లేదు.