బాలకృష్ణ గ్రేట్.. విజయసాయి రెడ్డి

తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై  ఎవరైనా సోషల్ మీడియా వేదికగా  విమర్శలు గుప్పిస్తున్నారంటే.. అది వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి రోజు.. వీరిపై  ట్విట్టర్ వేదికగా ఏదో ఒక విమర్శ చేస్తేనే కానీ  విజయసాయిరెడ్డికి  పూట గడవదన్న టాక్   సోషల్ మీడియాలో ఉంది.  అయితే తాజాగా టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్జతలు తెలపడం సంచలనంగా మారింది. 

జనవరి 27న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.  ఆ  సందర్భంగా  ఆయన బంధువు, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి..  చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  నందమూరి తారకరత్న.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అది ఎలాగంటే... విజయసాయిరెడ్డి భార్య సునంద.. చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డి.  ఆ అలేఖ్యా రెడ్డి.. తారకరత్న భార్య. అంటే.. విజయసాయిరెడ్డికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు. 

దీంతో విజయసాయిరెడ్డి.. బుధవారం(ఫిబ్రవరి 1) బెంగళూరులోని నారాయణ హృదయాలకు వెళ్లి.. మరదలి అల్లుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన పూర్తిగా సేఫ్ అని చెప్పారు. అయితే  తారకరత్న అస్వస్థతకు గురైన రోజు దాదాపు  45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ   నిలిచిపోవడంతో  మెదడు పైభాగం దెబ్బతిందని.. ఈ నేపథ్యంలో.. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌‌ కారణంగా.. లివర్ కానీ.. కొన్ని ఆర్గాన్స్‌కి కానీ.. రక్త ప్రసరణ తగ్గిందని.. దీంతో కొంత యాక్టివిటీ తగ్గిందని అన్నారు.   అయితే ఈ రోజు హార్ట్ ఫంక్షనింగ్ పర్ ఫెక్ట్ గా ఉందనీ,  మెదడులో ఎడిమా  అంటే వాపు  ఉందని.. ఇది మూడు నాలుగు రోజులు ఉంటుందని..  ఆ తర్వాత స్టెబిలైజ్ అయి.. వాపు తగ్గడం ప్రారంభమవుతుందని... వైద్యులు చెప్పారని విజయసాయి వివరించారు.  వైద్యులు  అద్బుతంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనీ. మంచి ట్రీట్‌మెంట్ కనిపిస్తోందని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం విషయంలో బాలకృష్ణ  ఎంతో కష్టపడ్డారనీ, అన్ని విషయాలూ ఆయన   స్వయంగా చూసుకొంటురన్న విజయ సాయి ఆయనకు కృతజ్జతలు తెలియజేసుకొంటున్నానన్నారు.       

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి ఫ్యామిలీతోపాటు నారా ఫ్యామిలీలో ఎంత ఆందోళన వ్యక్తమవుతుందో.. విజయసాయిరెడ్డి ఫ్యామిలీలో కూడా అంతే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సైతం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలోనే ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి... అతడికి అందిస్తున్న వైద్యాన్ని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.