ఢిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందన్న కోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ ఆకాంక్షలను వదులుకుని మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించినా కుమార్తెకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇసుమంతైనా ఊరట కలిగించలేకపోయారు. బీజేపీ  వ్యతిరేక వ్రతం స్వయంగా భగ్నం చేసుకున్నా.. అందకు ఆయనకు ఆ పార్టీ నుంచి ఫలం దక్కలేదంటూ కేసీఆర్ విమర్శకులు సెటైర్లు గుప్పిస్తున్నారు.

ఔను వరుస విచారణలతో ఇక కవిత అరెస్టే తరువాయి అన్న స్థాయి నుంచి అనూహ్యంగా కవితను కనీసం ఈడీ విచారణకు కూడా పిలవకుండా పక్కన పెట్టేసే వరకూ జరిగిన పరిణామాలలో కేసీఆర్ మౌనమే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ గా మారిపోయిందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. రాజకీయంగా ఎంతగా రాజీ పడినా, సర్దుకు పోయినా కేసు కోర్టు వరకూ వెళితే.. లాజికల్ ఎండ్ కు చేరాల్సిందే అన్నట్లుగా తాజాగా హస్తిన మద్యం కుంభకోణంలో కోర్టే ఈ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ  ఈడీ, సీబీఐ ల నుంచి ఇటువంటి ఆరోపణలు వచ్చాయి

కానీ.. ఈ సారి    న్యాయమూర్తే ఆధారాలున్నాయని చెప్పడం నిస్సందేహంగా కవితకు పెద్ద షాక్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన  లాభాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం ఆస్తులు కొనుగోలు చేశారనడానికి   ఆధారాలున్నాయని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు విస్పష్టంగా పేర్కొంది

నిధులు బదిలీ ,ఆస్తుల క్రయవిక్రయాలు, క్రియేటివ్‌ డెవలపర్స్‌ వాంగ్మూలాలు అన్ని కూడా కవిత ఆదేశాలనుసారమే జరిగినట్లు  కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కోర్టు  పిళ్లై బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో చేసింది.   ఈడీ సమర్పించిన  ఆధారాల మేరకు ఈ కేసులో అరుణ్‌ పిళ్లై ప్రధాన నిందితుడని  కోర్టు స్పష్టం చేసింది.   ఈ సందర్భంగా కవిత ప్రమేయంపై కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇక మద్యం కేసులో కవిత పూర్తిగా ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.