ఇడుపులపాయలో విజయమ్మ .. జగన్ ను క్షమించేశారా?

మేమంతా సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం (మార్చి 27)న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపుల పాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపులు పాయలో జగన్ ను తల్లి  విజయమ్మ ఆశీర్వదించారు. అయితే ఇడుపుల పాయలో విజయమ్మ జగన్ పక్కన కనిపించడంతో రాష్ట్ర రాజకీయవర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. 

ఎందుకంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి  వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం కిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ  గౌరవాధ్యక్ష పదవి ఏమంత  క్రియాశీల పదవి కాదు.  అయినా విజయమ్మ ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరుమీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పని చేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుటుక్కుమని తెగిపోయినట్లే అప్పట్లో అంతా భావించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశారు. పార్టీతో బంధం తెంచుకున్న తరువాత విజయమ్మ కూడా జగన్ తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు.  

కాగా అమె వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా వెనుక ప్యాలెస్ కూ ఉందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా సాగనంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలూ అప్పట్లో వెల్లువెత్తాయి.   వాస్తవానికి వైఎస్ మరణం తరువాత  జగన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచింది తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తల్లి విజయమ్మ జగన్ కు అండగా నిలిచిన కారణంగానే వైఎస్ అభిమానులంతా జగన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇక జగన్ రెడ్డి  జైల్లో ఉన్న రోజుల్లో కానీ, 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర  సాగించిన సమయంలో కానీ, పార్టీ వ్యవహారాలను  నడిపించింది కూడా విజయమ్మ, షర్మిల మాత్రమే.  జగన్ సతీమణి   భారతి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే, అమ్మ, చెల్లి రాజకీయ వ్యహారాలు చక్కపెట్టారు. ఇదే విషయాన్ని విజయమ్మ ప్లీనరీ వేదికనుంచి చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ ప్రస్తావించారు.

ముఖ్యంగా, జగనన్న విడిచిన బాణం అంటూ, షర్మిల చేసిన పాదయాత్రను అమె ఆ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయినా అంత చేసినా, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  చెల్లిని కష్టాలలోకి నేట్టేశారు, దూరం పెట్టారు అని అర్ధం వచ్చేలా, అందరికీ అర్ధమయ్యేలా తన రాజీనామా సందర్భంగా చేసిన ప్రసంగంలో ఒకింత సున్నితంగానే అయినా స్పష్టంగా చెప్పారు.  ఇప్పుడు జగన్ రెడ్డికి తన అవసరం, చెల్లి అవసరం లేదని అందుకే పార్టీని వీడుతున్నాననీ పరోక్షంగానే అయినా కుండబద్దలు కొట్టేశారు. 

ఇక అప్పటి నుంచీ జగన్ రెడ్డికి తల్లి, చెల్లితో సంబంధాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అన్నిటికీ మించి  వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చెల్లి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత నేరుగా జగన్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నేరుగా జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు నిస్తున్నారు. షర్మిల కుమారుడి, సొంత మేనల్లుడి  వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్యా సంబంధాలు ఎంతగా బెడిశాయో ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ.. జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ వేడుకోవడంతోనే విజయమ్మ మొక్కుబడి తంతుగా ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇడుపుల పాయలో జగన్ పక్కన తల్లి విజయమ్మ కనిపించడంతో మరో సారి జగన్ తల్లికీ, చెల్లికీ చేసిన ద్రోహం, వారి పట్ల వ్యవహరించిన తీరుపే రాష్ట్రంలో విస్తృత చర్చకు తెరలేచింది.