వైసీపీ నేతల నుంచే లక్ష్మీనారాయణకు ముప్పు!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ని కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. తన ప్రాణాలకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు ఎలాంటి హాని జరిగినా నంబాల రాజేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు బాధ్యులని లక్ష్మీనారాయణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నంబాల రాజేష్ కుమార్, వీవీ రాజు, గాలి జనార్దనరెడ్డి కలసి వున్న ఫొటోను కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అందించారు. ‘‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వున్న సమయంలో అనధికార మైనింగ్ విషయంలో గాలి జనార్దనరెడ్డిని విచారించాను. ఆ సమయంలో గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా ప్రచారంలో వున్న నంబాల రాజేష్‌కుమార్ కూడా విచారణను ఎదుర్కొన్నారు. ‘నా బాస్ గాలి జనార్డనరెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కి బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా వుంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్ అందరి ముందూ బాహాటంగానే మాట్లాడారు’’ అంటూ లక్ష్మీనారాయణ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు ఏదైనా ముప్పు ఏర్పడకముందే పోలీసులు స్పందించాల్సిన అవసరం వుంది.