ఎపిలో పించన్ల పంపిణీ పట్ల  కేంద్రఎన్నికల సంఘం అసంతృప్తి 

పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది
పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది.