మాల్యా చెక్ బౌన్స్ కేసులో ట్విస్ట్.. మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోండి..
posted on May 25, 2016 12:25PM

విజయ్ మాల్యాను చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ ఎర్రమంజిల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు పంపిన వారెంట్లు మళ్లీ తిరిగి ఎర్రమంజిల్ కోర్టుకే తిరిగి వచ్చేశాయి. కోర్టు పంపించిన అడ్రస్ కు వారెంట్లు వెళ్లినా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. తిరిగి ఆ వారెంట్లను కోర్టుకే పంపించేశారు. అంతేకాదు ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారని.. అందులో ఏ ఒక్క వ్యక్తి లేరని కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసు విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసిన కోర్టు... అసలు మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాను జారీ చేసిన సమన్లు వెనక్కు రావడంతో కొత్తగా మరోమారు సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. అయితే ఆ సమన్లను ఏ అడ్రెస్ కు పంపాలన్న విషయాన్ని పోలీసులే చెప్పాలని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ (జూన్ 6వ తేదీ)లోగా మాల్యా ఉంటున్న అడ్రెస్ ను తమకు అందజేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.