అలనాటి నటి సూర్యకళ ఇకలేరు!
posted on Jul 2, 2014 10:08AM

పాతతరం నటీమణి సూర్యకళ (80) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సూర్యకళ భరతనాట్యంలో శిక్షణ పొందారు. నటనపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. అక్కనేని, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో విలనీతో కూడిన పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ఆమె ధరించిన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిగా మంచి గుర్తింపు పొందారు సూర్యకళ. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన సూర్యకళ మొత్తం 5 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. సూర్యకళ భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. సూర్యకళకు పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. సూర్యకళ అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరిగాయి.