సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి
posted on Oct 30, 2024 2:15PM

సీబీఐ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ గా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వెంకట సుబ్బారెడ్డి ఐపీఎస్ ను సీబీఐ డిఐజీగా నియమిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు.
అసోం మేఘాలయ క్యాడర్ కు చెందిన 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వెంకట సుబ్బారెడ్డి ప్రస్తుతం షిల్లాంగ్ లో సీఐడీ డిఐజీగా పని చేస్తున్నారు. ఆయనను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈయన గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎస్పీగా పని చేశారు.