ఉత్తరాఖండ్ తగలబడుతోంది!

 

ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఓ పక్క దేశమంతా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై న్యాయస్థానాలు ఏమంటున్నాయి, నేతలు ఏమని తిట్టుకుంటున్నారు అని అంతా గమనిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం... అక్కడి అడవులు తగలబడటం! అడవులలో మంటలు చెలరేగడం కొత్తేమీ కాదు. కార్చిచ్చులు ప్రకృతిలో అతి సహజమైన పరిణామం. కానీ ఈసారి ఉత్తరాఖండ్‌లో చెలరేగుతున్న మంటల వెనుక కారణాలను పరిశీలిస్తే... ఆ మంటల్లో మనిషి నిలువెత్తు స్వార్థం కనిపిస్తుంది.

 

ఏటా రుతుపవనాలకు ముందుగా ఉత్తరాఖండ్‌ అడవులలో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే వచ్చేవి. కానీ గత రెండేళ్లుగా వర్షపాతం సరిగా లేకపోవడంతో ఇక్కడి అడవులలో ఉన్న దేవదారు వృక్షాలలో తేమశాతం తగ్గిపోయింది. ఉత్తరాఖండ్‌ అడవులలో ఇప్పుడు ఎటు చూసినా అలాంటి దేవదారు వృక్షాలే కనిపిస్తూ ఉంటాయి. దేవదారు ఆకులు చాలా కోసుగా ఉండి వెంటనే నిప్పంటుకుంటాయి. దేవదారు కలప నిప్పుకి నిలువెల్లా తగలబడిపోతుంది. ఇప్పుడు ఈ దేవదారు చెట్లే ఉత్తరాఖండ్‌ కొంప ముంచాయి. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు! ఉత్తరాఖండ్‌ అడవుల నిండా నానారకాల వృక్షజాతులన్నీ ఉండేవి. వాటిలో వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లు, తేమ ఎక్కువ శాతాన్ని నిలువ చేసుకునే చెట్లు... మంటలని నిలువరించేవి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ ఖరీదైన కలపని ఇచ్చే దేవదారు చెట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం మొదలుపెట్టారు అక్కడి జనం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 16 శాతం ఈ దేవదారు చెట్లే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ఒకప్పుడు అడవులు తగలబడితే అక్కడికి దగ్గర్లో ఉన్న గ్రామస్తులకి కాస్తో కూస్తో లాభం ఉండేది. ఆ కలపని తెచ్చుకుని వంట చెరుకు కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు అడవులు తగలబడటం కోసం కాచుకు కూర్చునేవారు చాలామందే తయారయ్యారు. అటవీ శాఖ నుంచి తగలబడిన కలపను కొనుక్కునేందుకు కలప వ్యాపారస్తులు సిద్ధంగా ఉంటారు. మరోపక్క  అడవులు తగలబడిపోయిన తరువాత మిగిలిన భూమిని ఆక్రమించుకునేందుకు భూకబ్జాదారులు ఎదురుచూస్తుంటారు. వీరితో చేతులు కలిపితే తమకి ఎంతో కొంత లాభం కలుగకపోతుందా అని స్థానిక గ్రామస్తులు కూడా ఆశపడుతుంటారు. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఉత్తరాఖండ్‌లో అడవులు తగలబడిపోవడం వెనుక ఇలాంటి దురుద్దేశాలు ఉన్నాయన్నది ఓ అనుమానం. ఆ అనుమానాన్ని బలపరుస్తూ కొన్నిచోట్ల నిప్పంటించేందుకు ప్రయత్నిస్తున్న ఆగంతకులని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

 

మూడు నెలలుగా ఎడతెరపి లేకుండా ఎగసిపడుతున్న ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ దళాలు సైతం మంటలను ఆర్పేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యలలో పావు వంతైనా, మంటలు మొదలవక ముందే తీసుకుని ఉంటే ఉపయోగం ఉండేదన్నది పర్యావరణవేత్తల ఆరోపణ. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దేవదారు వృక్షాలను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవడం; మంటలు త్వరత్వరగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం; తగినంతమంది అటవీ సిబ్బందిని నియమించడం; స్థానికులలో పర్యావరణ స్పృహ పెంపొందించడం; మంటలకు కారణమైనవారిమీద కఠిన చర్యలను తీసుకోకపోవడం.... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యాలు చాలానే కనిపిస్తున్నాయి.

 

ఉత్తరాఖండ్‌ కార్చిచ్చు వల్ల దాదాపు రెండు వేల హెక్టార్లకు పైగా అడవుల బూడిదపాలయ్యాయి. ఈ మంట్లలో కనీసం ఏడుగురన్నా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇది కేవలం కనిపించే నష్టం మాత్రమే! ఈ కార్చిచ్చుల వల్ల కనిపించని నష్టం అపారమన్నది విశ్లేషకుల మాట.

 

- మంటల నుంచి వ్యాపించే నుసి, హిమానీనదాల (గ్లేసియర్స్‌) మీద పేరుకోవడం వల్ల, అవి త్వరత్వరగా కరిగిపోతాయంటున్నారు పర్యావరణవేత్తలు.

 

- ఉత్తరాఖండ్‌గుండా ప్రవహించే గంగ, యమున వంటి నదులు ఈ కార్చిచ్చుల వల్ల పూర్తిగా కలుషితం అయిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

 

- ఈ కార్చిచ్చుల వల్ల వేలాదిగా పక్షులు, జంతువులు, చెట్లు అంతరించిపోయాయని అంచనా. వీటిలో కొన్ని అరుదైన జాతివి కూడా ఉండి ఉంటాయి.

 

- తీవ్రస్థాయిలో మంటలు చెలరేగడం వల్ల ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు కనీసం 0.2 డిగ్రీలు పెరిగి ఉంటాయని  అంచనా. మనుషుల మీద ఈ ఉష్ణోగ్రత పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ పర్యావరణం మీద ఈ కాస్త మార్పు కూడా తప్రక ప్రభావం చూపుతుంది.

 

- ఈ మంటలు ఉత్తరాఖండ్‌లోని దాదాపు 70 శాతం అడవులను కాల్చి వేశాయంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి పెరిగిన ఈ అడవులు తిరిగి సాధారణ రూపుకి రావాలంటే మరిన్ని శతాబ్దాలు, దశాబ్దాలు పట్టక మానదు.
ఇదీ ఉత్తరాఖండ్‌లో ఏర్పడిన రావణకాష్టం తాలూకు విషాదగాథ. మనిషి నిర్లక్ష్యానికీ, స్వార్థానికీ చెంపపెట్టులా కనిపించే ఈ ఉదాహరణ ఇకనైనా మనకు ఓ గుణపాఠంలా గుర్తుండిపోతుందని ఆశిద్దాం. అడవులను నాశనం చేసుకోవడం అంటే మన కాళ్లని మనమే నరుక్కోవడం అన్న నిజాన్ని గుర్తిద్దాం!

 

వృక్షో రక్షతి రక్షితః

Online Jyotish
Tone Academy
KidsOne Telugu