కాంగ్రెస్ లోకి కొండా బాటలో టీఆర్‌ఎస్ కీలక నేతలు.!!
posted on Nov 23, 2018 12:27PM

ఎన్నికలు తేదీ దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ కు తమ అభ్యర్థులు గెలుస్తారా? లేదా? అన్న భయం కంటే.. తమ పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా పార్టీని వీడతారా అన్న భయమే ఎక్కువగా వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కీలక నేతలు తమ పార్టీలో చేరతారని చెప్పడం. వారు చెప్పినట్టుగానే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొండా బాటలోనే మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విశేషం. తాజాగా గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలకని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. తెలంగాణలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు.