తెలంగాణ నుంచి కింగ్ ఫిషర్ బీర్ ఔట్.. కారణమేంటంటే?
posted on Jan 9, 2025 11:02AM

తెలంగాణ నుంచి తమ బ్రాండ్ బీర్లను ఉపసంహరించుకుంటున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. అంటే ఇక నుంచి ఆ కంపెనీ తెలంగాణకు తమ ఉత్పత్తులను సరఫరా చేయదు. యునైటెడ్ బ్రూవరీస్ నుంచి తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోనుందన్నమాట. ఆ కంపెనీ సరఫరా చేసే కింగ్ ఫిషర్, హెనీకిన్ బీర్లకు మంచి గిరాకీ ఉంది. బీరు ప్రియులు ఎక్కువగా కింగ్ ఫిషర్ ను ప్రిఫర్ చేస్తారు. అయితే ఇక నుంచి ఆ బీర్లు తెలంగాణలో దొరకవు. ఇది కచ్చితంగా బీరు ప్రియులకు చేదు వార్తే.
కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇందుకు కారణం తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ యునైటెడ్ బ్రేవరేజస్ కు భారీగా బకాయి పడడమే. అందుకే ఆ బకాయిలు చెల్లించేంత వరకూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి బీర్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ మందుప్రియులు ఎక్కువగా ఇష్టపడే కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవన్న మాట.