కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాతో సీఎం రేవంత్ భేటీ

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డాతో  భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం.. సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.. దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు. 

యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేక్‌లు కేటాయించ‌డం లేద‌ని... వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో  ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా అనుకుంటున్న పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే విదేశాల నుంచి ముడి సరుకులు దిగుమతుల విషయంలోనూ వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ముడిసరుకులు సకాలంలో రాకపోవడం వల్ల తెలంగాణలోని పరిశ్రమల ఉత్పత్తులు తగ్గిపోతున్నదని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నదని అందువల్ల ముడిసరుకుల దిగుమతుల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu