నేడు సిట్ ఎదుటకు కేంద్ర మంత్రి బండి సంజయ్
posted on Aug 8, 2025 8:24AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8) ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ఎదుట హాజరు కానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులనే కాకుండా, బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్న సిట్ అందులో భాగంగానే బండి సంజయ్ కూ నోటీసులు పంపింది.
ఆ నోటీసుల మేరకు వాంగ్మూలం ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ఎదుట హాజరుకానున్నారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన సీట్ అధికారులకు అందజేసే అవకాశం ఉంది.
ఇక పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పబడుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నది. ఇందు కోసం కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నాడు వీరు కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులతో భేటీ అయ్యారు.