విశ్వనగరం కాదు విశ్వనరకం!

విశ్వనగరంగా ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరం గురువారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి విశ్వనరకంగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు నానా యాతనలూ పడ్డారు.  

గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీ,  పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ తాలలో వాహనాలు నిలిచిపోయి చీమలబారును తలపించాయి.   ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గురువారం (ఆగస్టు 7) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.3 సెంటీమీటర్లు,  రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 14, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 13.2,  వలిగొండ వెంకటపల్లెలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 12.7 సెంటీమీటర్లు,  సరూర్‌నగర్‌లో 12.8, ఖైరతాబాద్‌లో 12.6, గండిపేటలో 12.2, యూసుఫ్‌గూడలో 12.4 సెంటీటర్లు, అదే విధంగా  ఉప్పల్‌లో 11.7, ఎల్బీనగర్‌లో 11.3,  
అమీర్‌పేటలో 11.1, షేక్‌పేటలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu