వావి వరసలు లేకుండా ఫోన్లు ట్యాప్‌ చేశారు : బండి సంజయ్

 

హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు. 

ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 

పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్ ట్యాప్ చేశారని వివరించారు. టీబీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన చుట్టూ నిఘా పెట్టారని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫ్యోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. గతంలో ఖమ్మం ఎంపీ దగ్గర పట్టుబడిన రూ.7 కోట్లు ఏమయ్యాయి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్‌ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. 

ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో బండి సంజయ్ మాట్లాడిన డేటాకు సంబంధించిన వివరాలను ఆయనకు సిట్ అధికారులు ఈ సందర్భంగా అందజేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu