తెలంగాణ మంత్రులకు నిరుద్యోగుల సెగ

ఇది ఒకరిదో ఇద్దరిదో   సమస్య కాదు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్ధులకు సంబందించిన సమస్య. ముప్పై లక్షల కుటుంబాల సమస్య. అయినా  టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు  విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించవలసిన తీరున స్పందించలేదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన చెందుతున్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. పలుచోట్ల మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, సూర్యాపేటలో మంత్రి  జగదీశ్ రెడ్డి క్యాంపు  కార్యాలయాలతో మాటు పాటు  కరీంనగర్లో మంత్రి గంగుల ఇంటినీ ముట్టడించారు. 

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు తమపై చేసిన విమర్శలకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటున్నమంత్రి కేటీఆర్  వీధిన పడిన తమ జీవితాలకు ఏమి సమాధానం చెపుతారని  నిరుద్యోగ యువకులు, విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు ఎవరూ పేపర్ లీకేజీపై ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుమనితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు సందర్భంగా కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు విద్యార్ధుల వద్దకు ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్నారు.  

అదలా ఉంటే సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసును ఏబీవీపీ ముట్టడించింది. ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఇంతవరకు లీకేజీ ఘటనపై స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్న మంత్రులు..ఎందుకు టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను విచారించట్లేదని మండిపడ్డారు.  టీఎస్పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవంక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీవీ నాయకులు ముట్టడించేందకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రూప్స్ పేపర్ లీకేజీలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.  దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్లపాలు చేసి వారి జీవితాలను అంధకారం లోకి నెట్టారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్  ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. లీకేజీ కి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తెలంగాణ యువతకు ఎలాంటి నమ్మకం లేదన్నారు.

నిజానికి  గతంలో నయీం కేసు, డ్రగ్స్ కేసు లకు సంబందించి,  అలాగే భూ కుంభకోణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు  కొండను తవ్వి  ఎలకను కూడా పట్టని నేపథ్యంలో 30 లక్షల మంది జీవితాలతో ముడిపడిన కేసును సిట్ పరిష్కరిస్తుందని తాము నమ్మడం లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.