ఎన్డీయేలోకి మరిన్ని చేరికలు.. సమాజ్ వాదీ పార్టీలో భారీ చీలిక!
posted on Jun 7, 2024 2:19PM
ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు పూర్తయ్యిందో లేదో అప్పుడే ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలలో చీలికలు, జంపింగులు ఆరంభమయ్యాయి. ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా పరిణామాలతో బీజేపీ కంపర్ట్ బుల్ పొజిషన్ లోకి వెడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.
శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్డీయేలో చేరికకు చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే ఢిల్లీ చేరుకుని మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన 9 ఎంపీ స్థానాలలో విజయం సాధించింది. మరో వైపు ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టిన సమాజ్ వాదీ పార్టీలో భారీ చీలికకు తెరలేచింది. ఆ పార్టీకి చెందిన 18 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
వీరు ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. విశేషమేమిటంటే అయోధ్య నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున విజయం సాధించిన ఎంపీ కూడా ఎన్డీయేకే మద్దతు పలుకుతున్న వారిలో ఉన్నారు. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా ఒకటి రెండు పార్టీల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయి.