మనుషులు నాలుగు రకాలు – మీరే రకం!

దేవుడు భూలోకం మీద సృష్టిని ఇంచుమించుగా పూర్తిచేశాడు. ఇక అక్కడిని మనిషిని పంపాల్సి ఉంది. మనిషంటే పరిపూర్ణుడై ఉండాలి. భూమిని కాపాడుకుంటూ, నాగరికతను ముందుకు తీసుకువెళ్లేవాడై ఉండాలి. అందుకోసం తన దగ్గర ఉండే కొంతమంది దేవదూతలనే మనుషులుగా పుట్టించాలనుకున్నాడు.

 

ఇలా దేవుడు సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోవడం చూసి ఓ దేవదూత నిదానంగా ఆయన దగ్గరకు చేరుకున్నాడు. ‘చాలా రోజులుగా మీరేదో పనిలో నిమగ్నమవ్వడాన్ని గమనిస్తున్నాను. అదేమిటో తెలుసుకోవచ్చా!’ అని అడిగాడు దేవదూత. అప్పుడు దేవుడు ఓపికగా తన మనసులోని మాటను చెప్పాడు, భూమి గురించి నిదానంగా వివరించాడు.
‘వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మీరు భూమిని ఎలా సృష్టిస్తున్నారు? అందులో ఎలాంటి జీవుల ఉంటాయి? భూమి లోపలికి తవ్వితే ఏం కనిపిస్తుంది? భూమి మీదకి నేను కూడా వెళ్లగలనా?’ అంటూ రకరకాల ప్రశ్నలతో దేవుడిని ముంచెత్తాడు దేవదూత.

 

దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’ఇంత ఆసక్తిగా అడుగుతున్నావు కాబట్టి, నిన్నే మనిషిగా మార్చి భూమి మీదకు పంపుతాను. తెలియని ప్రతి విషయం గురించి ఆసక్తిగా తెలుసుకునే అలవాటు నీలో కనిపిస్తోంది. కాబట్టి నువ్వు శాస్త్రవేత్తగా మారతావు. నీ తరహా మనుషులంతా భూమిని కొత్తకొత్త ఆవిష్కరణలతో సుఖమయం చేస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.

 

ఇదంతా పక్కనే ఉన్న మరో దేవదూత గమనించాడు...’అతణ్ని మీరు భూమి మీదకు ఎందుకు పంపారు? దేవదూత ఓ సాధారణ జీవిగా మారిపోతే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు భూమిని సృష్టించడంలో మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఊదరగొట్టేశాడు.

 

రెండో దేవదూత మాటలకు దేవుడు చిరునవ్వుతో...’నీకు మనిషి బయట ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కంటే, మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. నీలోకి నువ్వు తొంగిచూసుకునే గుణం కనిపిస్తోంది. కాబట్టి నువ్వు గొప్ప వేదాంతిగా మారతావు. నీ తరహా మనుషులు రకరకాల సిద్ధాంతాలతో సమాజాన్ని నిర్మిస్తారు,’ అంటూ అతగాడిని భూమి మీదకు పంపాడు.

 

భూమి గురించి తెలిసి ఒక దేవదూత, ఎవరూ లేని సమయం చూసి దేవుడి దగ్గరకు చేరుకున్నాడు. ‘భగవాన్‌! మీరేదో కొత్త లోకాన్ని సృష్టించారని తెలిసింది. ఇన్ని రోజులుగా నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. కానీ ఏమీ దక్కలేదు. నాకు ఆ భూలోకం ఇప్పించండి. నా దర్పం ఏమిటో చూపిస్తా!’ అని వేడుకున్నాడు.

 

మూడో దేవదూత మాటలకు దేవుడు కాసేపు ఆలోచించాడు. ఆవిష్కరణలను చేసేవాడు, ఆధ్మాత్మిక లోతుని చూసేవాడు భూలోకానికి చేరిపోయారు. కానీ అధికారం చలాయించేవారు కూడా ఒకరుండాలి కదా! అందుకని తన దగ్గరకు వచ్చిన మూడో దేవదూతని భూమి మీదకు పంపాడు. అతనూ, అతని తరహా మనుషులూ నాయకులుగా, రాజకీయవేత్తలుగా సాటివారి మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారని వరమిచ్చాడు.

 

దేవుడు భూమిని సృష్టించాడనీ, దాని మీదకు దేవదూతలను పంపుతున్నాడనే వార్త దేవలోకంమంతా పాకిపోయింది. ఎవరికివారు తమని ఆ కొత్త, అందమైన లోకం మీదకు పంపమని దేవుని చుట్టూ చేరసాగారు. వారి తాకిడితో దేవునికి సైతం చిరాకేసింది. ఇంతలో ఓ దేవదూత ఆయన దగ్గరకి చేరి ‘ప్రభూ! మీరు వీరందరి కోరికలతో విసిగిపోతున్నట్లున్నారు. నేను మీకు ఏమన్నా సాయం చేయగలనా? మీ చిరాకు తగ్గేందుకు ఏమన్నా సేవ చేయగలనా?’ అంటూ అడిగాడు.

 

నాలుగో దేవదూత మాటలు విన్న దేవునికి ముచ్చటవేసింది. ‘నేను భౌతికమైన అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలని పంపాను. మనసుని శోధించేందుకు వేదాంతులని పంపాను. పెత్తనం చెలాయించేందుకు నాయకులను పంపాను. కానీ తోటివారి గురించి ఆలోచించి... వారి బాధలో సాయపడి, వారి కన్నీటిని తుడిచే మనుషులు కూడా ఉండాలి కదా! అందుకు ఇతనే సరైనవాడు’ అనుకున్నాడు. వెంటనే ఆ దైవదూతని భూమ్మీదకు పంపాడు.
మరి! పైన పేర్కొన్న నాలుగు రకాలవారిలో మనం ఏ కోవకి చెందుతామో!
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.