తెలుగు వారి గుండెలు మండిన రోజు.. బాబు అరెస్టుకు రెండేళ్లు

ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి కన్నూ చెమ్మగిల్లిన రోజు.. ధర్మాగ్రహంతో గుండె మండిన రోజు.. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023 సెప్టెంబర్ 9న ఒక ప్రజా నాయకుడిని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచం మొత్తం గుర్తించిన వ్యక్తిని కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అప్పటి జగన్ సర్కార్ అరెస్టు చేసింది. అయితే ఆ అరెస్టే జగన్ పాలనకు చరమగీతం పాడటానికి కారణమైంది.  

ఒక దార్శనికుడిని కేవలం రాజకీయ వైరంతో ,  రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా రెండేళ్ల కిందట  ఇదే రోజు  (సెప్టెంబర్ 9)  అరెస్టు చేసింది.  దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది.  ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది.  దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది.   అప్పటి వరకూ ప్రభుత్వ దమనకాండ, అరాచక చర్యలకు భయకంపితులై.. నోరెత్తడానికే భయపడుతూ ఉన్న జనంలో  తిరుగుబాటు బావుటా ఎగిరేలా చేసిన అరెస్టు అది.  జగన్ ప్రభుత్వ అరాచక, అక్రమ చర్యను ప్రశ్నించడానికి కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం సమష్టిగా గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది.  విధ్వంస ప్రభుత్వం పతనానికి  నాంది పలికిన అరెస్టు అది.  చరిత్ర ఎన్నటికీ క్షమించని తప్పు ఆ అరెస్టు.

 ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగామార్చేసిన అరెస్టు అది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో గొంతెత్తేందుకు భయపడిన జనాన్ని.. ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేలా చేసిన అరెస్టు అది.  ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగేలా చేసిన అరెస్టు అది.  ఆ అరెస్టు  వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అప్పటి వరకూ బిక్కుబిక్కు మంటూ బతుకు జీవుడా అన్న చందంలో ఉన్నఏపీ ప్రజలలో చంద్రబాబు అరెస్టు ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాలలోనూ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

ఎక్కడైనా ఒక నాయకుడు అరెస్టైతే అందరూ ఆ నాయకుడు చేసిన అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుకుంటారు.  కానీ ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన అరెస్టు..  ఆయన చేసిన గొప్ప పనులు, అభివృద్ధికి దోహదం చేసిన ఆయన విధానాల గురించి మాట్లాడుకున్నారు.   ఆయన విధానాలతో ఐటీ కొలువులలో చేరి ఉన్నత స్థాయికి చేరిన ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైదరాబాద్ లో సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభను నిర్వహించారు. ఇలా సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలూ చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా గళమెత్తి.. పోరుబాట పట్టడం... ఆయన తన నాలుగు దశాబ్దాలకు పై బడిన రాజకీయ జీవితంలో... ప్రజల మద్దతును ఏ స్థాయిలో కూడగట్టుకున్నారో ప్రపంచానికి తేటతెల్లం చేసిన అరెస్టు అది.  చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల మనిషి, ప్రజాహృదయాలలో తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని చాటిన అరెస్టు అది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu