ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది.. మాస్క్ ఉంటేనే బయటికి రండి
posted on Dec 2, 2021 4:47PM
భయపడుతున్నట్లే జరిగింది. మాయదారి కొవిడ్ కొత్త వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్-19 వైరస్ కొత్త రూపాంతరం ఒమైక్రాన్ మనదగ్గరకు వచ్చేసింది.కర్ణాటకలో ఇద్దరికి కొత్త వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. అత్యంత వేగంగా వ్యాపించే ఈ కేసులు మన దేశంలో నమోదవడం ఇదే తొలిసారి.
ఈ రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు. వీరిలో ఒకరు నవంబరు 11న, మరొకరు నవంబరు 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపారు. ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు.
ఒమైక్రాన్ రూపాంతరాన్ని మొదట దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించారు. ఆ తర్వాత ఇది సుమారు 10 దేశాలకు వ్యాపించింది. ఇది మరింత విస్తరించకుండా మన దేశం కఠిన చర్యలు అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. ఒమిక్రాస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టింది కేంద్రం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది.