ఎస్బీఐ, ధ‌నీ బ‌జార్‌, లోన్ బ‌జార్‌.. న‌కిలీల ఖేల్ ఖ‌తం.. వారెవా స్టీఫెన్..

ఎక్క‌డో ఉంటారు. ఇంకెక్క‌డికో ఫోన్ చేస్తారు. +1860 180 1290 అనే నంబర్ నుంచి కాల్ వ‌స్తుంది. తాము ఎస్బీఐ కాల్ సెంట‌ర్ నుంచి ఫోన్ చేస్తున్న‌ట్టు న‌మ్మిస్తారు. ట్రూ కాల‌ర్‌లోనూ ఈ నెంబ‌ర్ ఎస్బీఐదేన‌ని సూచిస్తుంది. క‌స్ట‌మ‌ర్లు నిజ‌మేన‌ని భ్ర‌మ‌ప‌డ‌తారు. ఆ త‌ర్వాత భారీగా మోస‌పోతారు. ఇలా 33వేల మందికి కాల్స్ చేసి.. కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టారు ఆన్‌లైన్ కేటుగాళ్లు. ఇది ఒక త‌ర‌హా మోసం.

ఇక మ‌రో న‌కిలీ ముఠా ఉంది. లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తారు. ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ యాప్‌లు క్రియేట్ చేస్తారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారు. ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటారు. ఆ త‌ర్వాత ఎంత‌కీ లోన్ అమౌంట్ క్రెడిట్ కాదు. తాము మోస‌పోయామ‌ని తీరిగ్గా తెలుస్తుంది. 

ఇలా ఎస్బీఐ కాల్ సెంట‌ర్‌, లోన్ యాప్‌లతో దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అతిపెద్ద సైబ‌ర్ క్రైంను సైబ‌రాబాద్ పోలీసులు ఛేజించారు. ఆ రెండు ముఠాల స‌భ్యుల‌ను అరెస్ట్ చేశారు. ఆ వివ‌రాల‌ను సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. 

ఓ ముఠా ఢిల్లీలో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇక.. ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్ల‌తో న‌కిలీ యాప్‌ల‌ను క్రియేట్ చేసి కోట్లు దండుకున్న కేసులో.. ఆ ముఠాలోని 14 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 17 చరవాణులు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌ వెల్లడించారు. ఇలాంటి మోస‌గాళ్ల నుంచి ప్ర‌జ‌లే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu