ఒకే చితిపై యువజంట అంత్యక్రియలు
posted on Feb 15, 2015 10:32AM

తమిళనాడులో మరణించిన భార్యాభర్తలను ఒకే చితి మీద వుంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా మాట్లపట్టి అన్నానగర్‌లో ప్రేమికుల రోజున ఈ ఘటన జరిగింది. మునియప్పన్, సత్య అనే యువతీ యువకులు గత ఏడాది ప్రేమవివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా వుండే ఆ జంట కలల పంట త్వరలో ఈ ప్రపంచాన్ని చూస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. మునియప్పన్ పొరుగూరికి వెళ్ళిన సమయంలో సత్యకి పురుటి నొప్పులు వచ్చాయి. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. భార్య మరణవార్త తెలిసి హుటాహుటిన తిరిగొచ్చిన మునియప్పన్ భోరున రోదిస్తూనే వున్నాడు. భార్య అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా, రోదిస్తూనే గుండె పోటుతో మరణించాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక కన్నుమూసిన మునియప్పను, సత్యను చూసి అక్కడున్న వారందరూ విలపించారు. చివరికి ఇంత అన్యోన్యంగా జీవించిన జంటను ఒకే చితిమీద వుంచి దహనం చేశారు.