చేతులు మారనున్న టీవీ9 గ్రూప్
posted on Nov 10, 2011 1:23PM
ముం
బై: టీవీ9 వార్తా ఛానళ్ళ సముదాయం చేతులు మారనుంది. ఈ సంస్థలో ప్రధాన వాటాదారు, ఐల్యాబ్స్ అధినేత శ్రీనివాస రాజు తన 65 శాతం వాటాను ఓ జాతీయ మీడియా సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్రూప్‌లో పదిహేను శాతం వాటా కలిగిన ఈక్విటీ సంస్థ SAIF సైతం జతకలిసిన ఈ డీల్ విలువను రూ.500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే శ్రీనివాస రాజు సహా ఐల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు ముంబైలో జరుగుతున్న ఈ ఒప్పంద చర్చలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించినట్లు టీవోఐ వార్తా సంస్థ పేర్కొన్నది. అంత్యదశలో ఉన్న ఈ ఒప్పందం కుదిరితే, నూతన యాజమాన్యం వినోద ప్రసారాలు (ఎంటర్ టైన్‌మెంట్ ఛానెల్) ప్రారంభానికి యోచన చేస్తున్నట్లు వినికిడి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) దేశవ్యాప్తంగా ప్రాంతీయ వార్తాఛానళ్ళు (టీవీ9) నిర్వహిస్తున్నది. పూర్వం ‘సత్యం కంప్యూటర్స్’లో భాగస్వామ్యం కలిగిన శ్రీనివాస రాజు 2000 సంవత్సరంలో ఆ సంస్థ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థను ప్రారంభించారు. 2004లో ఏబీసీఎల్ నెలకొల్పారు.