నన్నూ అరెస్ట్ చేయండి.. ముద్రగడ ఆందోళన

 

తుని ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి అరెస్ట్ పై స్పందించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టులకు నిరసన తెలుపుతూ అమలాపురంలో ఆందోళనకు దిగారు. అమలాపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్న చేస్తూ.. తనను కూడా అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు భారీ ఎత్తున కాపు నేతలు అమలాపురం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. ఈ నేపథ్యంలో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 


కాగా కాపు ఐక్య గర్జన ఉద్యమం రోజున రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును దహనం చేసిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రౌడి షీటర్ దూడల ఫణిని కూడా ఉన్నాడని.. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనంలో దూడల ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, మిగతా నిందితులు ఎక్కడివారో ఫణిని విచారిస్తే తెలుస్తుందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవడంతోపాటు తుని ఘటన వెనుకున్న అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసులు తెలిపారు.