తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక
posted on Jul 31, 2025 4:30PM
.webp)
తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలవంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది.
ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయనీ, అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయనీ పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమలలో పుణ్యక్షేత్రంలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.