డిఫెన్స్ లో పడిన ఆర్టీసీ జేఏసీ... సమ్మె కొనసాగిస్తారా? విరమిస్తారా?

 

తమ డిమాండ్ల సాధన కోసం నెలన్నరగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులు డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ హైకోర్టు ఒక్కసారిగా సాఫ్ట్ టర్న్ తీసుకోవడంతో ఆర్టీసీ జేఏసీ కంగుతింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించడంతో ఆర్టీసీ జేఏసీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక, అటు ప్రభుత్వం... ఇటు యూనియన్ల మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి నెలన్నర దాటుతోన్నా... ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షనూ లేకపోవడంతో... కార్మికుల భవిష్యత్తుపై గందోరగోళం నెలకొంది. మరోవైపు, తమ ప్రధాన డిమాండైన ఆర్టీసీ విలీనాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టినా.... ప్రభుత్వం కఠిన వైఖరి వీడకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న కుట్ర ఉందన్న సునీల్‌ శర్మ అఫిడవిట్‌పై కార్మిక జేఏసీ మండిపడింది. అసలా అఫిడవిట్‌ రాజకీయ లీడర్ ఇచ్చినట్లుగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఎండీ ఎలా చెబుతారని మండిపడ్డ ఆర్టీసీ జేఏసీ... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కమిటీ వేస్తే.... సమ్మెపై పునరాలోచిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని మరోసారి హైకోర్టుకు తేల్చిచెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగోలేదని, సమ్మె కారణంగా మరింత నష్టం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు-పెట్టినా... తిరిగి ఏక్షణమైనా మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని కోర్టుకు వివరించింది. 

ఇక, ఎప్పటిలాగే ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని మరోసారి ప్రభుత్వం కోరగా.... సమ్మె లీగలో... ఇల్లీగలో చెప్పే అధికారం ...లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ పరిధి దాటి సమ్మె చట్ట విరుద్ధమంటూ ఆదేశించలేమని తేల్చిచెప్పింది. మరోవైపు, ప్రభుత్వంతో చర్చలకు కమిటీ వేయాలన్న ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి కూడా కోర్టు నో చెప్పింది. అయితే, రెండు వారాల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో ఆర్టీసీ కేసు కీలక మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, హైకోర్టు తాజా వ్యాఖ్యలు... ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉండటంతో... ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మెపై పునరాలోచనలో పడింది. అప్పటికప్పుడు సడన్ బంద్ ను వాయిదా వేసుకోవడంతోపాటు.... సమ్మె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu