ట్రంప్ టారిఫ్ ల కొరడా!
posted on Aug 1, 2025 1:16PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న టారిఫ్‌ల కొరడా ఝులిపించారు. తాజాగా పలు దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70కిపైగా దేశాలపై 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్‌లను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వాణిజ్య లోటు కారణంగా టారిఫ్‌లు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు. అయితే ఆ దిశగా భారత్‌తో ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్యంతో పాటు అనేక భౌగోళిక రాజకీయ అంశాలు ఈ చర్చలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.
కొత్త టారిఫ్స్‌లో భాగంగా భారత్‌పై ట్రంప్ పాతిక శాతం సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడాపై సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు. ఔషధాల అక్రమ దందాకు కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల పెంపుపై అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే.. ఈ పెంపు మరో వారం తరువాత అమల్లోకి రానుంది. ఇక పెంపునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆగస్టు 7 లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు ఆక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయి.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయి ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోదముద్ర కూడా వేయాల్సి ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. చైనాపై సుంకాల విధింపునకు అమెరికా ఆగస్టు 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ వారం స్టాక్‌హోం వేదికగా జరిగిన చర్చల్లో చైనా డిమాండ్స్‌ను అమెరికా గట్టిగా వ్యతిరేకించినట్టు సమాచారం