నోబుల్ ప్రైజు వేట‌లో ట్రంప్!

మొన్నీ మ‌ధ్యే ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం కోసం అధికారిక నామినేష‌న్ దాఖ‌లు చేసింది అమెరికా. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు నోబుల్ పురస్కారం రావడానికి ఎక్కువ అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. మొన్న భార‌త్- పాక్ యుద్ధం, నిన్న ఇరాన్- ఇజ్రాయెల్ వార్, మ‌ధ్య‌లో గాజా- ఇజ్రాయెల్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం. ఈ విష‌యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్ధి మ‌స్క్ నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు చూస్తే థాయ్- కంబోడియా ఘ‌ర్ష‌ణ‌. 

భార‌త్- పాక్ ఘ‌ర్ష‌ణ‌ను సుంకాల‌తో ఆపిన‌ట్టు కోర్టులోనే చెప్పుకున్నారు ట్రంప్. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లోకి డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చి బంక‌ర్ బ‌స్ట‌ర్లు వేసి మ‌రీ ఈ యుద్ధం ఆపాన‌ని అంటారు. ఇప్పుడు థాయ్- కాంబో వార్ ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారాయ‌న‌. మీరు గానీ ఈ ఘ‌ర్ష‌ణ ఆప‌కుంటే వాణిజ్య ఒప్పందాల‌న‌నీ ర‌ద్ద‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. థాయ్ ప్ర‌ధాని సైతం అందుకు తాము సిద్ధంగానే ఉన్న‌ట్టు చెప్పారు.

నిజానికి ట్రంప్ శాంతికాముకుడిగా పేరు సాధించాలంటే చేయాల్సిన ప‌ని.. ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ ఆపాల్సి ఉంటుంది. అదేమో అంత తేలిగ్గా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అప్ప‌టికీ ట్రంప్ ర‌ష్యాకు 50 రోజుల గ‌డువు ఇచ్చారు. లేకుంటే మీకు, మీ భాగ‌స్వామ్య దేశాల‌కు సుంకాల మోత మోగిస్తాన‌ని అన్నారు. ఆ మొత్తం 100 శాతం పైగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కూడా.  కార‌ణం.. ర‌ష్యా ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో అమెరికా అధ్య‌క్షుల పాలిట‌ మొండి ఘ‌టంలానే వ్యవహరిస్తున్నది. 

ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ట్రంప్ సుంకాలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా.. ఈ శాంతి స్థాప‌న చేస్తున్నారు. ఇక్క‌డ స్వామి కార్యంలో స్వ‌కార్యం అన్న‌ట్టు.. ఉక్రెయిన్ ర‌ష్యాతో యుద్ధంలో ఉండ‌గానే ప‌దేళ్ల ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారు ట్రంప్. ఇక పాక్  భార‌త్ తో వార్ లో ఉండ‌గానే.. త‌న కుటుంబ సంస్థ డ‌బ‌ల్యూ ఎల్ ఎఫ్.. తో సంత‌కాలు పెట్టించుకున్నారు. ఒక ప‌క్క త‌న దేశ అవ‌స‌రాలు, మ‌రో ప‌క్క త‌న వ్యాపార అవ‌స‌రాలు తీర్చుకుంటున్న ట్రంప్ నోబుల్ ప్రైజ్ కి ఎలా అర్హుల‌వుతారు.. అన్న‌ది కూడా ఒక ప్ర‌శ్న‌గా క‌నిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu