డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం...
posted on May 10, 2017 4:51PM
.jpg)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికి షాకిలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలమైన నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. ఇప్పటికే పలువురిని.. పలు పదవుల నుండి తీసేసిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌నే విధుల నుంచి తొలగించారు. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు విభాగమయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమియోను డిస్మిస్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ ప్రకటించారు.
అమెరికా ఎన్నికల సందర్భంగా రష్యాతో ట్రంప్ సత్సంబంధాలు నడిపి.. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ హ్యాకింగ్‌కు పరోక్షంగా సహాయపడ్డారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణ మొదలుపెట్టిన ఎఫ్‌బీఐ.. కీలక విషయాలను సేకరించింది. అయితే విచారణ పూర్తి కాకుండానే.. ‘ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమియోను తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా అటార్నీ జనరల్ జెఫ్ సెస్సన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్ సంయుక్తంగా ప్రెసిడెంట్‌కు లేఖ రాశారు. దీంతో వారి వినతిని ట్రంప్ ఆమోదించారని, తక్షణమే జేమ్స్ కోమియోను డిస్మిస్ చేస్తున్నట్లు సీన్ స్పైసర్ వెల్లడించారు. దీంతో అమెరికాలో ఇది చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన రహస్యాలు బయటపడతాయనే ట్రంప్ ఈ విధంగా చేసి ఉంటారని ప్రత్యర్థులు భావిస్తున్నారు.