క్వారంటైన్‌లో పవన్ కల్యాణ్!
posted on Apr 11, 2021 1:46PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయిలో జరుగుతోంది. గురువారంతో ప్రచార గడువు ముగియనుంది. అయినా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. ఒకరోజు రోడ్ షా నిర్వహించిన పవన్.. మళ్లీ ప్రచారానికి రావడం లేదు. అటు వకీల్ సాబ్ సినిమా విడుదలై.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్లలో కొత్త రికార్డులు స్పష్టిస్తుందని చెబుతున్నారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను జగన్ సర్కార్ రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు సీరియస్ స్పందించారు. చివరకి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వకీల్ సాబ్ కు మద్దతుగా జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు అని జనసేన తెలిపింది.
ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.