మునిసిపల్ ఎన్నికలకు సై అంటున్న యువత!!

సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నేతలు గెలుపుపై ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో యువత పోటీకి ఎక్కువగా ఉత్సాహం చూపుతోంది. అన్ని పార్టీల నేతలు కొత్త ముఖాలను బరిలోకి దించాలని యోచిస్తున్నాయి. 

జిల్లాలో గతంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిధిల విలీనం వార్డుల విభజన వంటి సమస్యలూ కోర్టు పరిధిలో ఉన్నందున జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మిగిలిన ఏడు పురపాలకల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. కానీ అందరి దృష్టీ పటాన్ చెరువు నియోజక వర్గం పైనే పడింది ఇక్కడ మేజర్ పంచాయతీలు ఈసారి మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు చాలా మంది ఔత్సాహికులు సయ్యంటూ సవాలు విసురుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు నియోజక వర్గం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వుంటుంది. ఈ ప్రాంతమంతా దాదాపుగా హైదరాబాద్ లో కలిసినట్టే ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పటాన్ చెరువు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. భూములు కూడా కోట్లలో ధర పలుకుతాయి. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలగా మారి హోదా పెరిగింది. దీంతో అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. అదే సమయంలో గ్రామ స్థాయి నేతలంతా పట్టణ స్థాయి నేతలుగా ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. 

ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కనిపిస్తుంది. బిజెపి కూడా అన్ని చోట్లా పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీలను ఢీకొని క్యాడర్ మాత్రం కమలనాథులకు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మహిపాల్, మూడు మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ కావడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికీ మునిసిపల్ ఎన్నికలు చలికాలంలో వేడి పుట్టిస్తున్నాయి.